రాజకీయాలు ఇప్పుడే కాదు: చిరంజీవి
హైదరాబాద్: ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. అయితే తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోనని మాత్రం కచ్చితంగా ఆయన చెప్పలేదు. ఒక ప్రయివేట్ టీవీ చానల్ రికార్డు చేసిన కార్యక్రమంలో ఆయన తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన రాజకీయ ప్రవేశం గురించి చేసిన వ్యాఖ్యలను ఆ ప్రయివేట్ టీవి చానల్ వార్తల్లో ప్రసారం చేసింది.
ఇంద్ర సినిమా విజయవంతమైన నేపథ్యంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖాయమన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో సమర్థులైన రాజకీయ నేతలున్నందున తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్న లేదని ఆయన ఈ ప్రయివేట్ టీవీ చానల్ కార్యక్రమంలో చెప్పారు. తాను రాజకీయాల గురించి ఏనాడూ మాట్లాడలేదని, మొదటిసారి కుప్పంలో మాట్లాడానని, అదీ కుచ్చి కుచ్చి అడిగితే మాట్లాడానని ఆయన అన్నారు. తాను అన్న మాటలు కూడా స్పష్టంగానే ఉన్నాయని ఆయన చెప్పారు.
పరిపాలనాదక్షత, సామర్థ్యం లోపించిన నాయకులు కొరవడినప్పుడు ప్రజలు కోరితే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం పరిపాలనాదక్షత, సామర్థ్యం మెండుగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
