లివ్-ఇన్ రిలేషన్లో ఘోరం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య, తల్లీకూతుళ్ల అరెస్ట్!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భాగస్వామి చేతిలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటనలో మృతుడి లిన్-ఇన్ భాగస్వామితో పాటు ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని ఉత్తర 24 పరగణాల జిల్లా బారాసత్కు చెందిన సార్థక్ సర్కార్(25)గా గుర్తించారు. ఆయన కోల్‌కతాలోని గరియా ప్రాంతంలో ఉన్న ఓ అద్దె ఫ్లాట్‌లో తన ప్రియురాలు సంచాలిక బసుతో కలిసి నివాసముంటున్నాడు.
గొడవతో మొదలై ప్రాణాలు తీసిన ఘటన
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సార్థక్, సంచాలిక మధ్య ఏదో విషయమై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. గొడవ ముదిరిపోవడంతో ఆగ్రహానికి గురైన సంచాలిక, ఇంట్లోని పదునైన ఆయుధంతో సార్థక్ భుజంపై దాడి చేసింది. ఆ దెబ్బకు తీవ్రంగా గాయపడిన సార్థక్ గట్టిగా అరిచాడు. ఆర్తనాదాలు విన్న పొరుగువారు వెంటనే ఫ్లాట్‌కి చేరుకుని గాయపడిన సార్థక్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

లివ్-ఇన్ భాగస్వామి, ఆమె తల్లి అరెస్ట్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో ప్రాథమిక విచారణ అనంతరం సంచాలిక బసును అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో సంచాలిక తల్లి మౌమిత బసు పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మౌమిత బసును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సంచాలిక బసు స్థానిక టెక్నో ఇండియా ఇన్స్టిట్యూట్లో చదువుతున్న పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తు వేగవంతం
కేవలం క్షణికావేశంలో జరిగిన గొడవ వల్లే ఈ దాడి జరిగిందా లేదా దీని వెనుక వేరే ఏవైనా ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ హత్యలో నిందితురాలి తల్లి ఎలాంటి పాత్ర పోషించిందనే దానిపై ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘోరం గరియా ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది.














Click it and Unblock the Notifications
