షేర్ మార్కెట్‌పై వాజ్‌పేయి ఆందోళన
న్యూఢిల్లీ: పెట్టుబడులు పెట్టడానికి సురక్షితమైనదానిగా దేశ క్యాపిటల్ మార్కెట్‌ను తీర్చిదిద్దడానికి రెగ్యులేటర్, మార్కెట్ ఇంటర్మీడియరీస్, ఇన్వెస్టర్లు చేతులు కలపాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పిలుపునిచ్చారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాలకు కారణమైన కార్పోరేట్ పాలనావ్యవహారాల ప్రమాణాల దుస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాపిటల్ మార్కెట్ల సాంకేతిక పరిజ్ఞానం, రెగ్యులేటరీ చట్రం మెరుగైనప్పటికీ కార్పోరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు పెరగలేదని ఆయన అన్నారు. భారత రెగ్యులేటర్ సెక్యురిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు (సెబీ) ఏర్పాటు చేసిన సెక్యురిటీస్ మార్కెట్ అవేర్నెస్ ప్రచార కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
స్టాక్ మార్కెట్ కుంభకోణాలు భారత వాణిజ్య వర్గాలకు చెడు పేరు తెచ్చి పెట్టాయని, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యుటిఐ) సంక్షోభం చిన్న ఇన్వెస్టర్లను ఇబ్బందులకు గురి చేసిందని, గత కొద్దేళ్ల అనుభవాల నుంచి మనం సరైన గుణపాఠాలు నేర్చుకోవాల్సి వున్నదని ప్రధాని అన్నారు.
భద్రమైన మార్కెట్ల అవసరం ఉన్నదని, పరిజ్ఞానం గల ఇన్వెస్టర్ల అవసరం ఉన్నదని, స్థిరమైన, వేగవంతమైన ఆర్థిక పెరుగుదలను సాధించాల్సి ఉన్నదని, ఇవి వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని ఆయన అన్నారు.
కొద్ది కంపెనీలు మాత్రమే ప్రైమరీ మార్కెట్‌ను ట్యాప్ చేయడం ఆందోళనకరమైన విషయమని, చాలా కంపెనీలు తరుచుగా ప్రశ్నార్థకమైన, అక్రమ పద్ధతుల్లో తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం విచారకరమని ఆయన అన్నారు.
స్టాక్ మార్కెట్ కుంభకోణాల వల్ల ఇన్వెస్టర్లు మార్కెట్‌పై విశ్వాసం కోల్పోయారని, దీంతో సుదీర్ఘకాలం స్తబ్దత ఆవరించిందని, మార్కెట్లో పెట్టాల్సిన డబ్బులు ఆర్థికేతర ఆస్తులకు, సేఫ్ బ్యాంక్ డిపాజిట్లకు మళ్లాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications