పాలమూర్ ప్రాజెక్టులకు కమిటీ
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టుల సత్వర పూర్తికి ప్రజాప్రతినిధుల కమిటీని వేయనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. 74వ నిబంధన కింద శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానిమిస్తూ ఈ విషయం చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
నీటి కేటాయింపు లేని ప్రాజెక్టులకు నీరు కేటాయిస్తామని, నిధులు కూడా సమకూరుస్తామని మంత్రి చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు రాగానే రాష్ట్రం లోపల కృష్ణా జలాలను వివిధ ప్రాజెక్టులకు నీటిని కేటాయిస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల పనులకు నిధుల కొరత లేదని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలమూర్ జిల్లాను దత్తత తీసుకుని ఏడేళ్లు పూర్తయినా ఒక నీటి పారుదల ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడం పట్ల కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని రాజోలిబండ, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతలు, తదితర ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని జి. చిన్నారెడ్డి (కాంగ్రెస్) అన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రజా ప్రతినిధుల కమిటీ వేసినట్లుగా పాలమూర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి కమిటీ వేయాలని ఆయన కోరారు.
అంతకు ముందు స్పీకర్ 32 శాఖల పద్దులను చేపట్టారు. దీనికి పాలమూర్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ పాలమూర్ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు ఆమోదించారు.












Click it and Unblock the Notifications