క్రికెట్ వీక్షణకు రండి: ముషార్రఫ్‌కు పియం ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్ పాక్‌ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడటానికి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను ఆహ్వానించారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించింది.
భారత్, పాక్‌ల మధ్య జరిగే ఏదో ఒక మ్యాచ్ చూడటానికి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వస్తారని భారత అధికార వర్గాలు తెలియజేశాయి. ముషార్రఫ్ది స్నేహపూర్వక పర్యటన మాత్రమేనని, ప్రతి పర్యటన అధికారికంగా ప్రభుత్వ పర్యటన కావాల్సిన అవసరం లేదని ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు అంతకు ముందు అన్నారు.
ముషార్రఫ్‌కు ఆతిథ్యం ఇవ్వడాన్ని భారత్ ఆనందంగా స్వీకరిస్తుందని, ముషార్రఫ్ ఏ మ్యాచ్‌నైనా చూడవచ్చునని ఆయన అన్నారు. భద్రతా ఏర్పాట్లతో పాటు ముషార్రఫ్ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడానికి ఇస్లామాబాద్‌ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
భారత్, పాక్‌ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను చూడటానికి గతంలో పాకిస్థాన్ అప్పటి అధ్యక్షుడు జియా వుల్ హక్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన పొరుగున ఉన్నవారెవరైనా భారత్‌కు ఏ సంకోచం లేకుండా ఏ సమయంలోనైనా వచ్చిపోవచ్చునని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, భారత్, పాక్‌ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడటానికి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను ఆహ్వానించే విషయంలో తాము ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు రణబీర్ సింగ్ తెలిపారు. ముషార్రఫ్‌ను ఆహ్వానించే విషయంపై నిర్ణయం తసీకోవాల్సింది భారత ప్రభుత్వమే తప్ప బిసిసిఐ కాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
