బెంగాలీ సెంటిమెంట్ కు దిగొచ్చిన సీఎం..! ఆలయంలో చేపతో భోజనం..!
పశ్చిమ బెంగాల్లో ఈసారి దసరాకు మాంసాహారం ముట్టకూడదంటూ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన బాగేశ్వర్ బాబా పిలుపునివ్వడం, ఆయనకు మద్దతుగా సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం వ్యాఖ్యలు చేయడంతో స్థానికంగా తీవ్ర వివాదం నెలకొంది. దసరా సందర్భంగా కాళీమాత ఆలయాల్లో చేపలతో భోజనం తినడం బెంగాలీలకు అలవాటు. కానీ బాగేశ్వర్ బాబా ప్రభావంతో సీఎం సువేందు అధికారి దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం వెనక్కి తగ్గారు.
స్వయంగా కాళీమాత ఆలయానికి వెళ్లి చేపల కూరతో సీఎం సువేందు అధికారి భోజనం చేశారు. బెంగాలీల సెంటిమెంట్ ను తాను గౌరవిస్తున్నట్లు చెప్పుకునేందుకు ఆయన ఇలా చేయాల్సి వచ్చింది. అంతకు ముందు హిందూత్వ ప్రభావంతో బెంగాల్లో నాన్ వెజ్ ను నిషేధించేందుకు ప్రయత్నించిన సువేందు.. ఇప్పుడు ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గడమే కాకుండా, స్వయంగా తానే చేపల కూరతో భోజనం చేయడంతో విమర్శలకు తాత్కాలికంగా చెక్ పడింది.

కోల్‌కతాలోని శతాబ్దాల నాటి కాళీఘాట్ ఆలయంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి చేపలను ఆరగిస్తున్న సందర్భంలో, అందరి దృష్టి ఆయన పళ్ళెం మీద కాకుండా, గత వారం రోజులుగా నగరంలో వినిపిస్తున్న విమర్శల మీద పడింది. దుర్గా పూజ సమయంలో మాంసాహారం తినే బెంగాలీ హిందువులను బాగేశ్వర్ బాబా మందలించడమే ఇందుకు కారణం. దీంతో శాక్త హిందువులు పవిత్రంగా భావించే కౌశికీ అమావాస్య సందర్భంగా సీఎం సువేందు నిన్న సాయంత్రం కాళీఘాట్‌ను సందర్శించారు. కాళీఘాట్ భోగపాత్రకు ప్రతీక అయిన ఒక భారీ చేప తలతో కూడిన భోగాన్ని ఆయన నేలపై కూర్చుని స్వీకరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో పాటు వేయించిన చేపలు, బసంతి పులావ్ (పసుపు అన్నం) కూడా ఉన్నాయి. కాళీఘాట్‌లో ప్రధాన దైవమైన కాళీమాతకు చేపలు, బలి ఇచ్చిన మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు సీఎం వీడియోను ప్రస్తావిస్తూ, శాకాహార-మాంసాహార వివాదానికి ముగింపు పలకాలని బీజేపీ కోరుతోంది.














Click it and Unblock the Notifications
