నక్సల్స్ వస్తే ఆయుధాలపై చర్చకే రావాలి: వైయస్
హైదరాబాద్: నక్సలైట్లు రెండో విడత చర్చలకు వస్తే ఆయుధాలు విసర్జించే విషయంపై చర్చించడానికే రావాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తాము నక్సలైట్లను చర్చలకు ఆహ్వానిస్తున్నామని, అయితే వారు రాదలుచుకుంటే ఆయుధాలపై చర్చ చేయడానికే రావాలని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు. తుపాకులు వదిలిపెడితేనే నక్సల్స్‌తో సమస్యలపై చర్చిస్తామని ఆయన అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద గానీ, గ్రూపుల వద్దగానీ అనధికారికంగా ఆయుధాలు ఉండడం సరి కాదని ఆయన అన్నారు.
చర్చలు చర్చల కోసం జరగకూడదని, తాము అలా భావించడం లేదని, చర్చల వల్ల ఫలితాలు రావాలని, సుస్థిర శాంతి తమ లక్ష్యమని, శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరగాలని ఆయన అన్నారు. మొదటి విడత చర్చల్లో నక్సలైట్లు కొన్ని సమస్యలు చెప్పారని, వాటిని పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
రాజోలిబండ మళ్లింపు పథకంపై మినీ జల విద్యుత్ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ తీరు మొగడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రాజెక్టుకు 2003లో మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడే అనుమతి లభించిందని, ఈ ప్రాజెక్టు విషయం ఈ ఏడాది జనవరిలో తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ప్రాజెక్టు విషయంలో తప్పులేమైనా జరిగి వుంటే నిపుణుల కమిటీ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మన ప్రయోజనాలకు భంగం కలగకుండా ఆ ప్రాజెక్టు ఉపయోగపడితే మంచిదేనని, అయితే ఇటువంటి ప్రాజెక్టు ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూదని ఆయన అన్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్‌పర్సన్ హోదాలో సోనియా గాంధీ శంకుస్థాన చేస్తారని ఆయన అన్నారు. ఎవరి చేత శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందనేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుర్తించాలని ఆయన అన్నారు. అసహనానికి గురై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
