హింస విడనాడే గ్రూపులతో చర్చలు: మన్మోహన్
న్యూఢిల్లీ: హింసకు స్వస్తి చెప్పే ఏ తీవ్రవాద సంస్థతోనైనా ప్రభుత్వం అర్థవంతమైన చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అంతర్గత భద్రత, శాంతిభద్రతలపై శుక్రవారం ఏర్పాటయిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తీవ్రవాదంపై నిర్దిష్టమైన, నిశ్చిత పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. తీవ్రవాదం విషయంలో రాజకీయ రాజీ ఉండకూడదని ఆయన అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న చొరుబాట్ల గురించి, సీమాంతర ఉగ్రవాదం గురించి, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదం గురించి, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం గురించి ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. అంతర్గత భద్రత కోసం రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని, దానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోగతాన్ని తెలుసుకున్న ఉగ్రవాదులు తిరిగి బస్సు సర్వీసులను అడ్డుకునే ప్రయత్నం చేయరని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
బలహీనవర్గాలపై ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకుని వాటిని ఆపడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications