హార్ముజ్ జలసంధిని మూస్తే ఇరాన్ క్లోజ్: ట్రంప్ మాస్ వార్నింగ్!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడమే కాకుండా వ్యూహాత్మక జలమార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌కు తనదైన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "మీరు గనుక హార్ముజ్ జలసంధిని మూసివేస్తే.. అసలు మీ దేశమే మిగలదు.. అంతే కాదు, మీరు కనీసం మీ సొంత దేశానికి కూడా తిరిగి వెళ్లలేరు" అంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద యుద్ధం రాకుండా నివారించేందుకు, లెబనాన్‌లో జరుగుతున్న పోరాటానికి ముగింపు పలికేందుకు పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు సాగుతున్నాయి. అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా.. ఇరాన్ తరఫున మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. గత వారం కుదిరిన ప్రాథమిక ఒప్పందంలో భాగంగా రెండు నెలల పాటు ఈ చర్చల ప్రక్రియ కొనసాగనుంది. సోమవారంతో ముగిసిన మొదటి రౌండ్ చర్చల అనంతరం.. హార్ముజ్ జలసంధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా పొరపాట్లు జరగకుండా నివారించేందుకు ఇరుదేశాల మధ్య ఓ ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసనగా తాము హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో గత వారాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' ద్వారా, ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇరాన్‌ను హెచ్చరించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాదులు సమస్యలు సృష్టించకుండా ఇరాన్ అడ్డుకోవాలని.. లేదంటే గత వారం కంటే మరింత బలంగా ఇరాన్‌పై దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ స్పందిస్తూ.. అమెరికా తమ కామెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇరాన్ సాయుధ దళాలు ఎలాంటి పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని బదులిచ్చారు.
నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను అదుపు చేయడంలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు ధరలు భారీగా పెరగడం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్స్‌పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలోనే వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరుపక్షాలు కమ్యూనికేషన్ లైన్ ఏర్పాటు చేసుకోవడం ప్రపంచ దేశాలకు కొంత ఉపశమనం కలిగించే అంశం.












Click it and Unblock the Notifications