మాకొక ఎయిర్ పోర్ట్ కావలెను.. పార్లమెంట్ సాక్షిగా పెద్ద డిమాండ్!
కేంద్రం ఏపీ,తెలంగాణా రాష్ట్రాలలో ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లిలో కూడా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చెయ్యాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. తెలంగాణలోని పెద్దపల్లి ప్రాంతానికి విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం చేసింది. ఆపై తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా పెద్దపల్లి ఎంపీ డిమాండ్
ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాకొక ఎయిర్ పోర్ట్ కావాలి అంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపల్లికి రావాల్సిన ఎయిర్‌పోర్ట్‌ను ఇతర ప్రాంతాలకు తరలించిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నేడు మండిపడిన ఆయన పెద్దపల్లికి ఎయిర్‌పోర్ట్ ఎంతో అవసరమన్నారు.

కేంద్రం ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకే ఎయిర్ పోర్టులు, ఇతర ప్రాజెక్ట్ లు
ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. అయితే కేంద్రం, బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే విమానాశ్రయాలు, ఇతర ప్రాజెక్టులను తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై కూడా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్న ఎంపీ
కేంద్రం ఆర్భాటంగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టులు, ఇతర ప్రాజెక్టులు ప్రారంభం కాకముందే లేదా కనీసం ఆరు నెలలు గడవకముందే కుప్పకూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు కేవలం హడావిడిగా కట్టే నిర్మాణాలు కాకుండా, తరాలపాటు నిలిచిపోయే నిర్మాణాలు కావాలన్నారు. తమకు నాణ్యమైన ఎయిర్‌పోర్ట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.పార్లమెంట్‌లో సరైన చర్చలు, సలహాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని వంశీకృష్ణ మండిపడ్డారు.
పెద్దపల్లి ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోండి
ప్రాంతీయ అసమానతలను పక్కనపెట్టి పెద్దపల్లి ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ విమానాశ్రయం పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలు చాలా కాలంగా ఈ కోరికను వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ఈ ప్రాంత వాసుల వ్యాపారాలు, పర్యాటకం, విద్యా, వైద్య సేవలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన వెల్లడించారు.













Click it and Unblock the Notifications