బోండా ఉమకు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు...!!
విజయవాడ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- టీడీపీ నేతల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలు తమ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. కూటమి - వైసీపీ మధ్య హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా లక్ష్యంగా వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పైన ప్రశ్నించారు. తన పైన వ్యాఖ్యలు చేసిన బోండా ఉమాకు పేర్ని నాని సవాల్ చేసారు.
వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలపై మండిపడ్డారు. రాజమండ్రిలో మహిళా డాక్టర్‌ను వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు దారుణంగా చంపేసినా, గంజాయి బ్యాచ్ పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నా పట్టించుకోవ టం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతి పేరుతో ప్రమోషన్ల హడావుడి చేస్తూ రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారే తప్ప, సాగునీరు లేక అల్లాడుతున్న కృష్ణా డెల్టా రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు.

ఇక తనపై, తన కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన రూ. 50 కోట్ల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాము ఆ డబ్బు ఇచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ గానీ, కనీసం ఒక్క ఫోటో గానీ ఉంటే బయటపెట్టాలని, దమ్ముంటే ఈడీతో కేసు పెట్టి తమను జైలుకు పంపాలని నేరుగా సవాల్ విసిరారు.
రాజమండ్రిలో ఓ మహిళా డాక్టర్‌ను ఇద్దరు తాగుబోతు టీడీపీ కార్యకర్తలు కారుతో గుద్ది, తొక్కించి దారుణంగా చంపేస్తే.. పోలీసులు దాన్ని ఓ యాక్సిడెంట్ కేసుగా నీరుగార్చారని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మహిళలకు రక్షణ కల్పించే దిశా చట్టాన్ని ఎత్తేశారని చెప్పుకొచ్చారు. ఇంత దారుణాలు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏమయ్యారని ప్రశ్నించారు. ఆ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లారా అంటూ నిలదీసారు. ఇక ఆడపిల్లల రక్షణపై వందల మీటింగుల్లో ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కేవలం ట్వీట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో బోండా ఉమా చేసిన ఆరోపణల పైన స్పందించారు. తాను, తన సతీమణి వెళ్లి ఎవడో 'మావయ్య' కాళ్ల మీద పడి రూ. 50 కోట్లు కట్టామని చెబుతున్నారని.. ఆ మావయ్య చంద్రబాబు అయినా, లోకేష్ అయినా ఇంకెవరైనా సరే.. తాము ఆ మావయ్య ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ గానీ, ఒక్క ఫోటో గానీ ఉంటే బయటపెట్టాలని... దమ్ముంటే ఈడీతో కేసు పెట్టించి తనను ఆ రూ. 50 కోట్లు తీసుకున్న మీ మావయ్యను ఇద్దరినీ జైల్లో వేయాలని పేర్ని నాని సవాల్ చేసారు.














Click it and Unblock the Notifications