VIDEO: కాళ్ల మీద పడి ఏడ్చినా కరగని కర్కశ వ్యవస్థ! రైతన్న కన్నీటి గాథ!
దేశానికి వెన్నెముక' అని మైకులు పగిలిపోయేలా ప్రసంగాలు దంచే పాలకులారా.. కాస్త కళ్లు తెరిచి చూడండి! మీ పాలనలో అన్నదాత వెన్నుముక విరిగిపోతోంది. మట్టిలో చెమట చిందించి దేశానికి తిండిపెట్టే రైతు, ఈరోజు ఒక బస్తా యూరియా కోసం నడిరోడ్డుపై మోకరిల్లి భిక్షమెత్తుకుంటున్నాడు.
పొలాల్లో పచ్చని పంటలు కలకలలాడాల్సిన వేళ, ఎరువుల కేంద్రాల వద్ద కన్నీటి ఏరులు పారుతున్నాయి. కాలం కలసిరాక, విత్తనాలు దొరకక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నను ఆదుకోవాల్సింది పోయి.. 'సాంకేతికత' పేరుతో అతని నెత్తిపై గుదిబండను మోపారు. ఇది ప్రభుత్వ వైఫల్యమా? లేక రైతు బతుకంటే అధికారులకు ఉన్న చులకన భావమా?

"కాళ్లు పట్టుకుంటా సామీ.. ఒక సంచి ఇయ్యండి!"
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో జరిగిన ఉదంతం చూస్తే ప్రతీ ఒక్కరిని కదలించి వేస్తుంది. వ్యవస్థను ఛీ కొట్టాలనిపిస్తుంది. పీఏసీఎస్ కేంద్రానికి వచ్చిన ఒక వృద్ధ రైతు, అక్కడ ఉన్న అధికారుల కాళ్లపై పడి దండం పెడుతూ ఏడ్చిన దృశ్యం ఈ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. "సార్.. దండం పెడతా, కాళ్లు పట్టుకుంటా.. నాకు ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా ఇయ్యండి. నాకు కొడుకులు లేరయ్యా.. ఫోన్లలో యాప్‌లు వాడటం నాకెట్ల వస్తది?" అంటూ ఆ పెద్దాయన పెడబొబ్బలు పెడుతుంటే, సిబ్బంది గుండెల్లో ఏకోశానా కనికరం కలగకపోవడం క్రూరత్వానికి పరాకాష్ట! ఓటు వేయించుకోవడానికి కాళ్లు పట్టుకునే నాయకులు.. ఇప్పుడు ఓటేసిన రైతునే కాళ్ల దగ్గర పడేసుకుని రాక్షస ఆనందం పొందుతున్నారు.
యూరియా కోసం కాళ్లు పట్టుకున్న రైతు!
— oneindiatelugu (@oneindiatelugu) August 13, 2026
మెదక్ జిల్లా రంగంపేటలో యాప్ ద్వారా యూరియా బుక్ చేయడం చేతకాక ఒక రైతు పీఏసీఎస్ సిబ్బంది కాళ్లు పట్టుకుని కంటతడి పెట్టాడు. అదనపు డబ్బులు ఇస్తానన్నా స్టాక్ లేదనడంతో ఆ అన్నదాత నిరాశతో వెనుదిరిగాడు#Farmer #UreaShortage #Telangana #ViralWatch pic.twitter.com/UbSKFEknsh
ఏసీ రూముల నుంచి ఏలే దొరలారా.. ఇదేనా మీ పాలన?
చదువురాని పల్లెటూరి రైతుకు 'మొబైల్ యాప్ బుకింగ్' అని నిబంధనలు పెట్టడం ఏ రకమైన పిచ్చిచర్య? చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాలి, దానికి డేటా ప్యాక్ ఉండాలి, ఏసీ గదుల్లో కూర్చునే ఉన్నతాధికారులు డిజైన్ చేసిన ఆ యాప్‌లో ఆప్షన్లు నొక్కడం తెలిసి ఉండాలి. కేవలం ఫోన్ వస్తే ఎత్తి మాట్లాడటం మాత్రమే తెలిసిన అమాయక రైతు, ఈ డిజిటల్ నెట్‌వర్క్ చదరంగంలో ఎలా గెలుస్తాడు? కనీసం నెట్‌వర్క్ కూడా సరిగ్గా ఉండని పల్లెటూర్లలో ఆన్‌లైన్ బుకింగ్ అని కండిషన్లు పెట్టే ముందు.. అసలు ఆ నిర్ణయం తీసుకున్న పాలకులకు కాస్తయినా ఇంగితజ్ఞానం ఉందా అని కడుపు మండిన రైతాంగం నిలదీస్తోంది.
పంట పండకముందే ప్రాణాలు తీస్తున్న నిబంధనలు!
సాంకేతికతను తీసుకురావడం అంటే రైతులకు సాయం చేయడం, అంతే తప్ప వాళ్లను సచ్చేలా వేధించడం కాదు. ఊళ్లల్లో అధికారులు తిరిగి యాప్‌ల గురించి అవగాహన కల్పించారా అంటే అదీ లేదు. యూరియా సంచి దొరకక పైరు ఎండిపోతుంటే.. చేసిన అప్పులు తీర్చే దారిలేక అన్నదాతలు పురుగుల మందు డబ్బాలను ఆశ్రయిస్తున్నారు.
సీతాకోకచిలుకలు వాలాల్సిన పొలాల్లో శవాల దిబ్బలు లేస్తున్నాయి. రైతు కన్నీరు పారిన నేల ఏనాడూ బాగుపడలేదన్న నిజం పాలకులు గుర్తుంచుకుంటే మంచిది. ఎల్ నినోతో అల్లాడుతున్న రైతుల కోసం ఇలాంటి విధానాన్ని పక్కనబెట్టి సులభంగా, నేరుగా యూరియా అందేలా చర్యలు తీసుకోకపోతే.. ఆగ్రహించిన అన్నదాత తిరగబడటం ఖాయం!














Click it and Unblock the Notifications