ఉద్రిక్తల మధ్య బాబు పర్యటన: పోలీసు కాల్పులు
హైదరాబాద్/ మెదక్: మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరువు యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక మండలం పోతురెడ్డి పేటలో చంద్రబాబు కాన్వాయ్‌పై టి ఆర్‌యస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ సమయంలో టిడిపి, టి ఆర్‌యస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో టి ఆర్‌యస్ కార్యకర్తలు దూరంగా వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గొడవల్లో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఒక ప్రైవేట్ టీవీ చానల్ కెమెరామన్ గాయపడ్డారు.
సినీనటి విజయశాంతి విమర్శలపై తానేమీ వ్యాఖ్యానించబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు మెదక్ జిల్లాలో కరువు యాత్ర చేస్తూ పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన యాత్రకు తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
రామాయంపేటలో టి ఆర్‌యస్, టిడిపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. చంద్రబాబు కాన్వాయ్‌పై టి ఆర్‌యస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చేగుంటలోనూ టి ఆర్‌యస్ కార్యకర్తలు చంద్రబాబు పర్యటనకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా పోలీసులు లాఠీచార్జీ చేశారు. తూప్రాన్‌లో టి ఆర్‌యస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పర్యటనలో చంద్రబాబు కాంగ్రెస్, టి ఆర్‌యస్ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టి ఆర్‌యస్ కార్యకర్తల తీరుపై ఆయన మండిపడ్డారు. దుబ్బాక మండలం పూతారెడ్డిపేటలో టి ఆర్‌యస్ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు.
కాంగ్రెస్, టి ఆర్‌యస్ ప్రభుత్వం పనులు చేయడం లేదని, పైగా ప్రజల వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్, టి ఆర్‌యస్ వాళ్లు పనులు చేయలేరు, ప్రజల వద్దకు వెళ్లలేరని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 610 జీవో అమలు, విద్యుత్ సమస్య, ఎస్టీ, ఎస్సీల విద్యుత్ బకాయిల మాఫీ వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications
