పోలీసుల పహారాలో పులిచింతల పనులు ప్రారంభం
గుంటూరు/నల్లగొండ: కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన తర్వాత ఆరు నెలలకు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. పర్యావరణ అనుమతి లేకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిలిపేసింది. ఇప్పుడు పర్యావరణ అనుమతి లభించడంతో పనులు ప్రారంభమయ్యాయి. పులిచింతల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి అన్నారు.
పులిచింతల ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేస్తామని నీటిపారుదల సూపరింటిండెంట్ ఇంజనీర్ (యస్ ఇ) బాపూజీ చెప్పారు. పులిచింతల పనులను నీటి పారుదల శాఖ కార్యదర్శి భాను పరిశీలించారు. మల్లు రవి పనులను ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపియం నల్లగొండ నాయకత్వం డిమాండ్ చేసింది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోతే తోటపల్లి ప్రాజెక్టుకు పట్టిన గతే పులిచింతలకు పడుతుందని సిపియం హెచ్చరించింది. పులిచింతలకు ఇప్పటి వరకు అనుమతులు లేకపోవడం వల్లనే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదని, ఇప్పుడు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారు.
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. అయితే అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఈ ప్రాజెక్టును తెలంగాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు పనులు ప్రారంభమైన చోట నల్లగొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
