త్వరగా తేల్చండి: ప్రధానికి కెసిఆర్ టీమ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నేత కె. చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రతినిధి బృంధం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు. కెసిఆర్ నాయకత్వంలోని టి ఆర్‌యస్ ప్రతినిధి బృందం శుక్రవారం సాయంత్రం ప్రధానిని కలిసింది. తెలంగాణ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టి ఆర్‌యస్ నాయకులు ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీల వివరాలను వారు ప్రధానికి తెలియజేశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు గురించి వారు ప్రధాని దృష్టికి తెచ్చి దాన్ని ఆపించాలని కోరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకపోతే తెలంగాణలోని శ్రీరాంసాగర్ ఎండిపోతుందని వారు ప్రధానికి చెప్పారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఉపసంఘం తన నివేదక సమర్పణలో చేస్తున్న జాప్యాన్ని కూడా వారు ప్రధాని దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది.
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంపై చంద్రశేఖర్‌రావు ప్రధాని వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రధానిని కలిసిన అనంతరం చంద్రశేఖర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డెల్టాకు నీరివ్వడానికి ఒకటి కాకపోతే ఆరు ప్రాజెక్టులు కట్టుకోండి గానీ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చాలనేది తమ డిమాండ్ అని ఆయన అన్నారు. తాము మొదటి నుంచీ ఇదే డిమాండ్‌ను ముందు పెడుతూ వస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చెప్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని నక్సలైట్లు చేసిన ప్రకటనను అల్టిమేటంగా పరిగణించకూడదని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు అన్నారు. లాబీలతో, పైరవీలతో తెలంగాణ రాదని ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. పదవులు ముఖ్యమా, తెలంగాణ ముఖ్యమా తేల్చుకోవాలని నక్సలైట్లు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, రక్తపాతంతోనైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని తెలంగాణ పోరాట సమితి నాయకుడు గాదె ఇన్నయ్య హైదరాబాద్‌లో మరో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర కాలయాపన ధోరణిని తెలంగాణ ప్రజలు సహించబోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
