ప్రకాశం జిల్లాలో ముగ్గురిని చంపిన నక్సల్స్
ఒంగోలు/ హైదరాబాద్: ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం యాచవరం గ్రామంలో మావోయిస్టు నక్సలైట్లు ముగ్గురిని కాల్చి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో వారిని నక్సలైట్లు హత్య చేశారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత దాదాపు 40 మంది నక్సలైట్లు గ్రామంలో ప్రవేశించి ఐదు జట్లుగా విడిపోయి ముగ్గురిని హత్య చేసినట్లు సమాచారం. వారిని హత్య చేసిన చోట్ల నక్సలైట్లు లేఖలు వదిలి వెళ్లారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తూ గిరిజనులను దోచుకు తింటున్నందు వల్లనే ఈ ముగ్గురిని హత్య చేసినట్లు మావోయిస్టు నేత సాగర్ పేర ఆ లేఖలు వదిలివెళ్లారు. మావోయిస్టులు దాడి చేసిన సమయంలో గ్రామంలో కరెంట్ పోయిందని చెబుతున్నారు. హత్యకు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారని తెలుస్తోంది.
ఇదిలావుంటే, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని సిపిఐ (యంయల్) జనశక్తి నేత సాగర్ ఒక లేఖలో విమర్శించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో పోలీసులు తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను, ముగ్గురు సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటలిజెన్స్ వ్యవస్థను పెంపొందించుకునే పేరు ప్రభుత్వం కోవర్టులను ప్రవేశపెడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
