నక్సలైట్ల తీరుపై మంత్రి నాయని ఆందోళన
హైదరాబాద్: తమ నాయకులపై నక్సలైట్లు దాడి చేస్తుండడం పట్ల, రాజీనామాలు చేయాలని హెచ్చరించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, రాష్ట్ర సాంకేతిక విద్యామంత్రి నాయని నర్సింహారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతికి తావు లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ ఎంపిటిసి సభ్యుడు నాగభూషణాన్ని మావోయిస్టులు కాల్చి చంపడాన్ని ఆయన వ్యతిరేకించారు.
తాము తెలంగాణపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధన సాధించే స్థాయికి ఉద్యమాన్ని తీసికెళ్లామని ఆయన చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా నక్సలైట్లు తమను ఆందోళనకు గురి చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తాము మెజారిటీ పార్టీల మద్దతు కూడగట్టామని ఆయన చెప్పారు. ఐక్య ప్రగతిశీల కూటమిలో భాగస్వాములు కాని పార్టీల అభిప్రాయాన్ని కూడా తాము కూడగట్టామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని నక్సలైట్లు నడిపినట్లుగా నడపడం తమకు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
