తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ అసాధ్యం: వైయస్
సంగారెడ్డి: తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సిద్ధిపేటలలో ఆయన ఆదివారం నగరబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మెదక్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా ప్రాణహిత నుంచి నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆరు నెలల్లోగా సర్వే నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సింగూరు ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు.
బాసరలో ఐ ఐటి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీని వల్ల ముస్లిం సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీలను 15 కోట్ల రూపాయలతో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి నది నుంచి 180 మిలియన్ గ్యాలన్ల నీరు తరలిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
