రాష్ట్రంలో పెట్రో మంటలు: విపక్షాల ఆందోళన
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారంనాడు ఆందోళనకు దిగాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కాలనీ నుంచి లక్టీకా పూల్ వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద టిడిపి కార్యకర్తలు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. యుపి ఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కిషన్ రెడ్డి వామపక్షాలను డిమాండ్ చేశారు. ఒక వైపు యుపి ఎకు మద్దతు ఇస్తూ మరో వైపు వామపక్షాలు ఆందోళనలు నిర్వహించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. సిపియం కార్యకర్తలు హైదరాబాద్‌లో ఆటోలను లాగుతూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. సిపి ఐ కార్యకర్తలు కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం నాయకుడు గారపాటి సాంబశివరావు ఎడ్ల బండిపై ధర్నా కార్యక్రమానికి రాగా, మరో నాయకుడు జయరాజ్ రిక్షా తొక్కుతూ వచ్చారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి యుపిఎ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖపట్నంలో సి ఐటియు కార్యకర్తలు ఆటోలను రిక్షాలో వేసుకుని ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications
