టిఆర్‌యస్ ఒప్పందం వల్లే ఒత్తిడి: సత్యమూర్తి
హైదరాబాద్: ఏదో ఒప్పందం వుండడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకులు పదవులకు రాజీనామాలు చేయాలని నక్సలైట్లు ఒత్తిడి తెస్తున్నారని మాజీ నక్సలైట్ నేత, ప్రముఖ దళిత కవి కె.జి. సత్యమూర్తి అలియాస్ శివసాగర్ అభిప్రాయపడ్డారు. ఎక్కడో తప్పు ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. టిఆర్‌యస్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ కార్యకర్త కత్తుల ప్రకాశ్‌ను కోర్టులో హాజరు పరిచాలని కోరడానికి ఆయన హోం మంత్రి కె. జానారెడ్డిని కలిశారు. పదవులకు రాజీనామాలు చేయాలని నక్సలైట్లు డిమాండ్ చేయవచ్చునని, అయితే రాజీనామాలు చేయకపోతే సంహరిస్తామనడం సరి కాదని ఆయన అన్నారు.
ప్రజలు చేసేది ప్రజాపంథా అవుతుందని, ప్రజల తరఫున చేసేది అతివాదం అవుతుందని, మావోయిస్టులు అతివాదానికే పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఎన్నుకున్న ప్రజలు టి ఆర్‌యస్ నాయకులు రికాల్ చేయాలని, అయితే రాజీనామాలు చేయాలని మావోయిస్టులు బెదిరిస్తున్నారని, ఇది వారి అతివాద పంథాకు అనుగుణంగానే ఉందని ఆయన అన్నారు. టిఆర్‌యస్‌కు, మావోయిస్టులకు మధ్య ఒప్పందం లేకపోతే అంత కసిగా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేయరని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన సినీనటి విజయశాంతిపై అగౌరవించే విధంగా ప్రకటలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణ పేరు చెప్పుకుని పదవులు చేపట్టినవారిని రాజీనామాలు చేయాలని అడగడం తప్పెలా అవుతుందని సిపిఐ (యంయల్) జనశక్తి నాయకుడు సాగర్ ఒక లేఖలో అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం, దగా చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రివర్గంలో ఉండి పులిచింతలను అడ్డుకోలేకపోయిన టి ఆర్‌యస్ నాయకులు తెలంగాణను ఎలా సాధిస్తారని ఆయన నల్లగొండలోని మీడియా కార్యాలయాలకు పంపిన లేఖలో అన్నారు. మంత్రిపదవులు కావాలో, తెలంగాణ కావాలో టిఆర్‌యస్ తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
