అద్వానీ తప్పుకుంటే రాజకీయాలు పవిత్రం: విహెచ్‌పి
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ తప్పుకుంటే పార్టీ పవిత్రమవుతుందని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నాపై చేసిన ప్రకటనకు అద్వానీ రాజీనామా చేయాల్సిందేనని విహెచ్‌పి సీనియర్ నాయకుడు ఆచార్య ధర్మేంద్ర డిమాండ్ చేశారు. అద్వానీని విహెచ్‌పి క్షమించదని ఆయన అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.
అద్వానీ సంతులకు క్షమాపణ చెప్పాలని, గాంధీనగర్ లోక్‌సభ సీటుకు రాజీనామా చేయాలని, క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అద్వానీని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ లాగా ఉక్కు మనిషి అని భావించామని, ఇప్పుడు అద్వానీని అల్యూమినియం, ప్లాస్టిక్ లేదా కాగితం మనిషి అని పిలువాల్సి వస్తోందని ఆయన అన్నారు.
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కార్గిల్ దుస్సాహసానికి గానీ పార్లమెంటుపై దాడికి గానీ క్షమాపణ చెప్పనప్పుడు అద్వానీ జిన్నాను ప్రశంసించడంలోని, బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆవేదనకు వ్యక్తం చేయడంలోని ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అద్వానీ వ్యవహారం కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయమే కాదని, జాతీయవాదానికి జాతి గౌరవానికి సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. జిన్నాపై అద్వానీ వ్యాఖ్యలను బలపరచనందుకు ఆయన బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications
