కారత్‌తో ప్రధాని టెలిఫోన్ బాతఖానీ
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారంనాడు సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని మన్మోహన్ సింగ్ కారత్‌కు హామీ ఇచ్చారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ), వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశాలను బహిష్కరించాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో కారత్‌తో ప్రధాని మాట్లాడారు.
వామపక్షాలు లేవనెత్తుతున్న అంశాలన్నింటిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కారత్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సిమ్లా నుంచి ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత అన్ని అంశాలపై మరింతగా చర్చలు జరుపుతామని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. సోనియా ఐదు రోజుల తర్వాత ఢిల్లీ వస్తారు.
బిహెచ్‌ఇయల్‌లో పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ, ఈ ఉపసంహరణ కనీస ఉమ్మడి ప్రణాళిక (సియంపి) ఉల్లంఘనకు సంబంధించి మొదటి మెట్టు అని అభివర్ణిస్తూ సోనియాకు రాసిన లేఖ ప్రతిని వామపక్షాలు ప్రధానికి పంపాయి. ప్రభుత్వం రంగ సంస్థల్లో 51 శాతం వాటాలను ప్రభుత్వం ఉంచుకోవాలని వామపక్షాలు వాదిస్తున్నాయి. యుపి ఎ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వామపక్షాలకు 61 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కూడా వామపక్షాలు యుపి ఎ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నెల 28వ తేదీన దేశవ్యాప్తం ఆందోళన చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications
