పియంను కలిశాక తేల్చుకుంటాం: కెసిఆర్‌

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తమకు మద్దతు ఇస్తున్న పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత తాము కేంద్ర ప్రభుత్వంలో కొనసాగాలా, వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు చెప్పారు. ఈ రోజు సాయంత్ర ప్రధానిని కలుస్తున్నామని, సాధ్యమైనంత తొందరగా సోనియాను కలుస్తామని, యుపి ఎలోని తమ మిత్రులను కలుస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఐదుగురు టి ఆర్‌యస్‌ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ప్రధాని కార్యాలయం నుంచి కెసి ఆర్‌కు పిలుపు వచ్చింది. ఈ పిలుపు వచ్చిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధానితో సమావేశమైన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోందని, అందుకే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి తాము వైదొలిగామని ఆయన చెప్పారు. తాము రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలగడానికి నక్సల్స్‌ పట్ల వైయస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా ఒక కారణమని ఆయన అన్నారు. తాము రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి వైదొలగడానికి నక్సలైట్ల అంశం మాత్రమే కాదని, చాలా అంశాలున్నాయని ఆయన అన్నారు.డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా కాకుండా ఫాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. సాధ్యమైనంత తొందరగా తెలంగాణ ఇవ్వాలని ప్రధానిని డిమాండ్‌ చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వైయస్‌ ప్రభుత్వం పులిచింతల నిర్మాణాన్ని చేపడుతోందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, 13 సిమెంటు ఫ్యాక్టరీలు మునిగిపోతాయని, సున్నంరాయి గనులు మునిగిపోతాయని తాము ప్రధానికి చెప్పామని, అయినా పోలీసులను పెట్టి పులిచింతల నిర్మాణానికి పని చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ స్థితిలో ప్రభుత్వంలో ఉండి ఆందోళన చేపట్టకుండా ఉండడం సరి కాదని అనుకున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది తమ లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ఆపాలని, తెలంగాణ ఏర్పాటుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఇవి తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఏడాది గడిచిందని, యుపి ఎలోని 26 పార్టీలు తెలంగాణకు మద్దతిస్తున్నాయని, ఈ స్థితిలో ఇంకా ఎంతో కాలం నిరీక్షించలేమని ఆయన అన్నారు.

నక్సల్స్‌తో చర్చలు జరపాలనేది కూడా తమ డిమాండ్లలో ఒకటని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు శాంతి కోరుకుంటున్నారని, అందుకు నక్సల్స్‌తో చర్చలు జరపాలని ఆశిస్తున్నామని, ఎన్‌కౌంటర్లలో తెలంగాణవారే మరణిస్తున్నారని, తెలంగాణలో మానవ హక్కులను పునరుద్ధరించాలనేది తమ డిమాండ్‌ అని ఆయన అన్నారు. నక్సలైట్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సమంజసం కాదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని ఆయన అన్నారు. జనశక్తి నేత రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో వివాదానికి దిగడం తమ ఉద్దేశం కాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. తాము ఏడాదిలో చాలా సాధించామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజకీయంగా చైతన్యం కలిగించామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారడానికి కారణమవుతారని ఆయన అన్నారు. సోనియా గాంధీ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై, సోనియా గాంధీ తమ మాటను నిలబెట్టుకుంటారని తమకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తిరిగి చేరే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేవని ఆయన స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రశేఖర్‌ రావు హిందీలో మాట్లాడారు. మధ్య మధ్యలో మీడియా ప్రతినిధులు వేసిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఆంగ్లంలో సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+