ఆ తర్వాత కూడా టిఆర్‌యస్ వద్దు: కెకె.
హైదరాబాద్: మున్సిపాలిటీల, నగర పాలక సంస్థల చైర్‌పర్సన్, మేయర్ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) సహాయం తమకు అక్కరలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. కేశవరావు ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 26వ తర్వాత ఎవరు వెలుగులో ఉంటారో తేలిపోతుందని ఆయన టి ఆర్‌యస్ నేత కె. చంద్రశేఖర్ రావును ఉద్దేశించి అన్నారు.
తిరుగుబాటు అభ్యర్థులు రేపటిలోగా పోటీ నుంచి విరమించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, తిరుగుబాటు అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎన్నికల ఇన్‌చార్జీలతో ఆయన ఆదివారంనాడు పార్టీ కార్యాలయం గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విభేదాలను, వ్యక్తిగత స్పర్థలను పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి మారెప్పకు ఆయన అక్షింతలు వేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కమ్యూనిస్టు పార్టీల తిరుగుబాటు అభ్యర్థులను విరమింపజేయడానికి ఇక్కడి కమ్యూనిస్టు పార్టీలతో తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
