తుఫాను బాధితులను ఆదుకుంటాం: వైయస్
హైదరాబాద్: తుఫాను తాకిడి బాధితులను అన్ని విధాలా ఆదుకోనున్నట్లు, తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో తుఫాను తాకిడి ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. తుఫాను తాకిడికి మొత్తం ఆరుగురు మరణించినట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద అందే సహాయంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 వేల రూపాయలేసి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ముగ్గురు మరణించినట్లు ఆయన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో 40 వేల ఎకరాల వరి పంట నీట మునిగిందని, 850 ఎకరాల అరటితోటలు దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అయితే ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఇప్పుడు ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో పెరిగాయని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు డివిజన్‌లో మురికిరేవులో 40 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారని ఆయన చెప్పారు.
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్రంగా అంతరాయం కలిగిందని, మొత్తం 201 మండలాల్లో విద్యుత్ సరఫరా దెబ్బ తిన్నదని, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 92 మండలాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఆయన చెప్పారు.
తుఫాను తాకిడి ప్రాంతాలకు సీనియర్ అధికారులను పంపి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడు నెలలకు సరిపడే రేషన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. పునరావాస చర్యల కోసం రాజమండ్రి, భద్రాచలంలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు, పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్య బృందాలను తుఫాను తాకిడి ప్రాంతాలకు పంపినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
