ప్రత్యేక తెలంగాణకు ప్రజలు వ్యతిరేకమే: ఏచూరి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌కు తెలంగాణలోని ప్రజలు సుముఖంగా లేరని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయని సిపియం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. మెజారిటీ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుకోవడం లేదని ఫలితాలు తేల్చాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై తమ విధానం మొదటి నుంచీ ఒకటేనని, తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకమని ఆయన అన్నారు.
భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల విభజన జరిగిందని, ఇప్పుడు భాషను కాకుండా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటూ పోతే దానికి అంతు ఉండదని ఆయన అన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, తదితర రాష్ట్రాల ఏర్పాటును కూడా తాము వ్యతిరేకించామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏకాభిప్రాయం అవసరం లేదని తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ అనడాన్ని ఆయన ఖండించారు.
ముస్లిం రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రిజర్వేషన్ల కల్పనపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. కుల ప్రాతిపదికపై మాత్రమే రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించిందని, మత ప్రాతిపదికపై రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగంలో అవకాశం లేదని, ఒక వేళ అలా కల్పించాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి వుంటుందని ఆయన అన్నారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ సంతకాలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అమెరికాకు అనుకూలంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం సంతకాలు చేసిన విషయమై రేపు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో వామపక్షాల నాయకులు సమావేశమవుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
