సినీనటి కుష్బూకు కోర్టు నోటీసులు
చెన్నై: మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణపై దాఖలైన పిటిషన్‌పై తమిళనాడులోని తిరుచ్చి, ఎగ్బోర్ కోర్టులు దక్షిణాది సినీనటి కుష్బూకు నోటీసులు జారీ చేశాయి. కుష్బూపై చెన్నై కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. పెళ్లికి ముందు స్త్రీలు లైంగిక సంబంధాలను పెట్టుకోవచ్చునని, అయితే గర్భం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని కుష్బూ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంది.
కుష్బూ వ్యాఖ్యలపై తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగింది. దళిత పాంథర్స్ కార్యకర్తలు దక్షిణ భారత కళాకారుల సంఘం కార్యాలయంపై చీపుర్లు, చెప్పులతో దాడి చేశారు. పియంకె కూడా కుష్బూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుష్బూ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని కూడా రాజకీయ పార్టీల కార్యకర్తలు హెచ్చరించారు.
ఈ వివాదంతో సింగపూర్ పర్యటనలో ఉన్న కుష్బూ హుటాహుటిన చెన్నైకి తిరిగి వచ్చి క్షమాపణలు వేడుకున్నారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆమె చెప్పింది. తన వ్యాఖ్యలు బాధపెట్టి వుంటే క్షమాపణ కోరుతున్నానని ఆమె అంది. తన వ్యాఖ్యలపై ఆమె సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది. ఈ సమయంలో ఒకానొక సందర్భంలో కంట నీరు పెట్టుకుంది.












Click it and Unblock the Notifications
