టిడిపితో తెరాస పొత్తు తెలంగాణ ద్రోహం: కెకె
హైదరాబాద్: మెదక్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు ద్రోహం చేసిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు విమర్శించారు. తెరాసకు చెందిన ఆరుగురు కౌన్సిలర్ల సహకారంతో తెలుగుదేశం పార్టీ చైర్‌పర్సన్ పదవిని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. తెలంగాణ నినాదాన్ని తెరాస మంటగలిపిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీ అని, అందువల్ల తెరాస తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు ద్రోహం చేసిందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వామపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలాగా ప్రథమ శత్రువులు కావని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో కొన్ని చోట్ల తమ పొత్తు రాజకీయపరమైంది కాదని, స్థానిక పరిస్థితులను బట్టి సహకారం ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని ఆయన అన్నారు. బిజెపి, టిడిపిలతో తాము ఎప్పుడూ పొత్తు పెట్టుకోబోమని ఆయన అన్నారు. ప్రజాసమస్యలతో ముందుకు సాగినప్పుడు అందరి సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
