అసెంబ్లీ నుంచి బాబుతో సహా టిడిపి సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పట్టుబట్టడంతో బుధవారం శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. తమ పట్టు వీడకపోవడంతో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబుతో సహా తెలుగుదేశం సభ్యులను స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్ ముందు ఉంచాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కూడా తెలుగుదేశం సభ్యులతో గొంతు కలిపారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా సిపియం, తెరాస సభ్యులు, మజ్లీస్, బిజెపి సభ నుంచి వాకౌట్ చేశారు.
సస్పెండ్ అయిన తెలుగుదేశం సభ్యులు స్పీకర్ ఛేంబర్ వద్ద ధర్నాకు దిగారు. వారిని అక్కడి నుంచి మార్షల్ మోసుకెళ్లారు. ఈ స్థితిలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పీకర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని తెలుగుదేశం విమర్శించింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. అక్రమాలను తాము నిరూపించలేకపోతే తమ సభ్యులందరూ రాజీనామా చేస్తారని తెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మధ్యవర్తి వద్ద ప్రభుత్వం ఫైళ్లు పెడితే నిరూపిస్తామని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సిపియం ఆరోపించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనాల్లో 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది. స్పీకర్ వద్ద ఫైళ్లు ఉంచితే తాము నిరూపించి తీరుతామని సిపియం అంది. మంత్రి వద్ద ఫైళ్లను తాము పరిశీలించబోమని సిపియం ప్రకటించింది.
అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినందుకు తాము నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశామని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు అన్నారు. తెలుగుదేశం సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని, ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టనందుకు నిరసనగా తాము వాకౌట్ చేశామని సిపియం పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్ ముందు ఉంచనందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేసినట్లు బిజెపి పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని ఆయన నిరసించారు.












Click it and Unblock the Notifications
