నిమజ్జనోత్సవంనాడు విధ్వంసానికి కుట్ర: అపరిచితుడు
హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవం రోజున హైదరాబాదులో విధ్వంసానికి కుట్ర జరిగిందంటూ ఒక అపరిచితుడు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎం.ఎ. బాసిత్ కు లేఖ రాశాడు. ఇద్దరు వ్యక్తులు ఈ కుట్ర చేశారని, దాన్ని కార్యరూపంలో పెట్టడమే మిగిలిందని అతను ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖలోని అంశాల్లోని వాస్తవాస్తవాలను కనిపెట్టడానికి పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అయితే ఆ లేఖలోని ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని డిజిపి అంటున్నారు.
హైదరాబాదులోని జంట బాంబు పేలుళ్లలో జకీర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడని ఆ అజ్ఞాతవ్యక్తి లేఖలో ఆరోపించాడు. జకీర్ కుమారుడు జావేద్ పది మందితో ఒక టీంను ఏర్పాటు చేశాడని చెప్పాడు. హైదరాబాదులో విధ్వంసానికి జావేద్ కు ఇప్పటికే 50 లక్షల రూపాయల అడ్వాన్స్ ముట్టినట్లు అతను తెలిపాడు. జావేద్ పై గతంలో హైదరాబాదులోని సంతోష్ నగర్ పోలీసు స్టేషనులో అక్రమాయుధాల కేసు నమోదైందని అతను గుర్తు చేశాడు. జకీర్ ఇప్పుడు తన ఇల్లు కూడా మార్చాడని అతను చెప్పారు. గతంలో జకీర్ అటో నడిపేవాడని, ఇప్పుడు మారుతీ కారునూ బైకునూ వాడుతున్నాడని, ఉగ్రవాద సంస్థ హుజితో అతనికి సంబంధాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications