అపరిచితుడి లేఖ నకిలీదే: జానారెడ్డి
హైదరాబాద్: గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా విధ్వంసానికి జకీర్ అనే వ్యక్తి కుట్ర పన్నాడని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎం.ఎ. బాసిత్ కు ఇటీవల వచ్చిన ఆకాశరామన్న లేఖ నకిలీదని హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షానంతరం హోంమంత్రి జానారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలీసు శాఖలో 6475 మంది స్థానికేతరులను గుర్తించామని ఆయన చెప్పారు. వీరిని స్వస్థలాలకు బదిలీ చేశామని, అయితే గణేష నిమజ్జనోత్సవం దృష్ట్యా వారు ఇక్కడే డిప్యుటేషనుపై విధులు నిర్వహిస్తారని, ఇది ముగిసిన తర్వాత వారిని స్వస్థలాలకు పంపుతామని ఆయన వివరించారు.
హైదరాబాదులో నిమజ్జన కార్యక్రమం బందోబస్తుకు 15 వేల మంది కానిస్టేబుళ్లను నియోగించినట్లు ఆయన తెలిపారు. 8 సిఆర్పీయఫ్ బలగాలను, 7 రాపిడ్ ఫోర్సు యాక్షన్ బలగాలను నియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. 36 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. పోలీసు కమీషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications