మావిగన్ అంటేనే చంద్రబాబుకు భయం పుడుతుంది: జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరోసారి ముదిరింది. తాను ప్రతిపాదించిన 'మావిగన్' (MAVIGAN) కారిడార్ ప్రస్తావన వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీపీ పెరిగిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిద్రలో ఉండగా పొరపాటున ఎవరైనా 'మావిగన్' పేరు చెబితే చంద్రబాబుకు గుండె ఆగి చనిపోయేలా ఉన్నారని, గుండె ఆగిపోకపోతే అదృష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవలంబిస్తున్న తుగ్లక్ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ ఒక శాశ్వత రాజధాని లేకుండా పోతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు పలానా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు ఏకోశానా లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అత్యంత ఘోరంగా ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి, దారుణమైన అవినీతిని, దోపిడీని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ 'జంగిల్ రాజ్' (రాక్షస రాజ్యం) నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తమ బతుకు బండిని నడపడానికే తీవ్ర కష్టాలు పడుతున్న తరుణంలో, 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ' అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిరోజూ రుజువు చేస్తూనే ఉందన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, తన ఎల్లో గ్యాంగ్‌తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒక భూతంలా చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అమరావతి ఒక పెద్ద దొంగ మాట..
రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని, తన స్కాముల కోసమే అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు. అమరావతి అనేది ఒక 'సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్' అని బాబు చెప్పినవన్నీ దొంగ మాటలని తేల్చిచెప్పారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంట్ వంటి ప్రాథమిక వసతులు కల్పించడానికే అక్షరాల రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని గుర్తుచేశారు.
ఇప్పటికే అమరావతి కోసం తెచ్చిన, కమిట్ అయిన అప్పులు రూ. 47,387 కోట్లకు చేరాయని, దీనికితోడు రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ. 9,200 కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారని గణాంకాలతో వివరించారు. తన సొంత స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను ఎందుకు విరుస్తున్నావని ప్రశ్నిస్తేనే చంద్రబాబుకు బీపీ వస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న పెద్ద దురదృష్టమన్నారు.
అమరావతి శూన్యం.. మావిగన్ మాత్రమే ప్రాక్టికల్!
అమరావతిలో ప్రతి ఒక్కటీ శూన్యం (సున్నా) నుంచి మొదలుపెట్టాలని, దానికి బదులు అత్యంత ప్రాక్టికల్‌గా ఉండే 'మావిగన్' ప్రాంతాన్ని రాజధాని కారిడార్‌గా పెట్టమని తాము ప్రత్యామ్నాయాన్ని చూపామని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే తాము మావిగన్‌ను ప్రతిపాదించామని, దీనికి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందని చెప్పారు. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 3 ప్రధాన రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేల వంటి అద్భుతమైన కనెక్టివిటీ ఉందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో 9 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, పలు యూనివర్సిటీలు, మరెన్నో విద్యాసంస్థలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు.
ఇప్పటికే 35 నుండి 40 లక్షల మంది జనాభాతో సకల వసతులతో ఉన్న మావిగన్ ప్రాంతాన్ని వదిలేసి, శూన్యంలో రాజధాని కడతాననడం మూర్ఖత్వమేనన్నారు. తాము అడిగిన ఈ ప్రాక్టికల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, నిజాలు తట్టుకోలేక ఆక్రోశంతోనే చంద్రబాబు నాయుడికి బీపీ పెరుగుతోందని జగన్ విమర్శించారు. అందుకే సీఎం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తన క్యాబినెట్ మంత్రులతో వైసీపీపై బూతులు తిట్టిస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.














Click it and Unblock the Notifications