VIDEO: పోలీసుల ముందే జుట్టు పట్టుకుని కొట్టారు.. సీఎం గారు కాపాడండి!
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట ప్రాంతంలోని ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై హాస్టల్ నిర్వాహకులు సంచలన ఆరోపణలు చేశారు. తమ నుంచి కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకొని, ఇప్పుడు రౌడీలతో దౌర్జన్యాలు చేస్తూ భవనాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి వారి నుంచి ప్రాణహాని ఉందని ఏషియన్ పీజీ హాస్టల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమను కాపాడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేతులెత్తి వేడుకున్నారు.
బాధిత హాస్టల్ నిర్వాహకులు వీర హనుమాన్ రెడ్డి, ఆయన భార్య శివపార్వతి మీడియా ముందుకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయాన్ని కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. గత 21 ఏళ్లుగా తాము హాస్టల్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, మూడేళ్ల క్రితం బొంతు శ్రీదేవి తల్లి బాయమ్మకు చెందిన ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నామని తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 2 కోట్ల రూపాయలను అడ్వాన్స్ రూపంలో చెక్కుల ద్వారా ఇచ్చామని, అయితే ఆ చెక్కులు బౌన్స్ కావడంతో తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు.

ఈ వివాదంపై ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయని, న్యాయస్థానం తమకు అనుకూలంగా 'స్టేటస్ కో' (యథాతథ స్థితి) ఆర్డర్ ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ.. మాజీ మేయర్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా భవనాన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.
పోలీసుల ముందే జుట్టు పట్టుకుని దాడి.!
గత మూడు రోజులుగా బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవి సుమారు 20 నుండి 30 మంది రౌడీ మూకలతో కలిసి హాస్టల్ డైనింగ్ హాల్‌లోనే తిష్టవేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హనుమాన్ రెడ్డి ఆరోపించారు. హాస్టల్‌లో ఉంటున్న వందలాది మంది విద్యార్థినులను కూడా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని, సమాచారం బయటకు వెళ్లకుండా సిబ్బంది మొబైల్ ఫోన్లు లాక్కున్నారని మండిపడ్డారు.
అమీర్ పెట్ హాస్టల్ లో మాజీ మేయర్ అనుచరుల దాడి లో తీవ్రంగా గాయపడిన హాస్టల్ సూపర్ వైజర్#BonthuRammohan #Ameerpet #AmeerpetHostel #NewsUpdate #OIReels #Oneindiatelugu pic.twitter.com/BbSfuUdM7s
— oneindiatelugu (@oneindiatelugu) May 21, 2026
హాస్టల్ నిర్వాహకురాలు శివపార్వతి మాట్లాడుతూ, గతంలో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని, హిజ్రాలను, రౌడీలను పంపించి తమపై దాడులు చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా, పోలీసుల ముందే బొంతు రామ్మోహన్ అత్త (భవన యజమాని) శివపార్వతి జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. తమపైనే అక్రమ కేసులు బనాయించి పోలీసులతో వేధిస్తున్నారని వాపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి గారు.. మమ్మల్ని కాపాడండి!
ఈ రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే తన భర్త హనుమాన్ రెడ్డికి గుండెపోటు వచ్చిందని, మూడు స్టంట్లు పడ్డాయని శివపార్వతి తెలిపారు. తమ కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిలో బతుకుతోందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణభయంతో వణికిపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. నగరం నడిబొడ్డున ఇంత అరాచకం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని ఈ 'రౌడీయిజం' నుండి తమకు న్యాయం చేయాలని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ తీవ్ర ఆరోపణలపై మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రావాల్సి ఉంది.














Click it and Unblock the Notifications