రెండో పెళ్లి చేసుకోలేదు, సహజీవనమే: పవన్
హైదరాబాద్: తాను రేణూ దేశాయ్ తో సహజీవనం సాగిస్తున్నానని, పెళ్లి చేసుకోలేదని సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆయన రేణూ దేశాయ్ పేరు చెప్పకుండా తాను సహజీవనం చేస్తున్నానని మాత్రమే చెప్పారు. తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని ఆయన చెప్పారు. ఆయన సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. తాను పదేళ్ల క్రితం ఒక పెళ్లి చేసుకున్నానని, ఆ కేసు కోర్టులో ఉందని, అందువల్ల తాను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.
తన మొదటి పెళ్లి విషయం కోర్టులో ఉందని, ఈ విషయంలో తాను తప్పు ఏమైనా చేసినట్లు రుజువైతే జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. నందిని అమ్మాయితో పదేళ్ల క్రితం తనకు పెళ్లయిందని, ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. తాను నిజాయితీగా జీవించడానికి ప్రయత్నిస్తున్నానని, అట్లని తప్పులు చేయలేదని కాదని, వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నానని ఆయన చెప్పారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చాలా ఉద్వేగపూరితంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications
