జైలులోనే సంజయ్ దత్ దీపావళి పండుగ
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలులోనే దీపావళి పర్వదినాన్ని జరుపుకోనున్నాడు. సంజయ్ దత్ బెయిల్ పిటిషనుపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆయుధాల చట్టం కింద సంజయ్ దత్ కు టాడా కోర్టు ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది. దాంతో ఆయన ప్రస్తుతం పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
1993 ముంబయి పేలుళ్ళకు సంబంధించి అక్రమంగా ఎకె 56 రైఫిల్ ను, ఒక పిస్టల్ ను కలిగి ఉన్నందుకు టాడా కోర్టు తనకు వేసిన శిక్షను సంజయ్ దత్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. టాడా కోర్టు తీర్పు ప్రతి అందకపోవడంతో సంజయ్ దత్ కు ఇంతకు ముందు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గత వారం తనకు టాడా కోర్టు తీర్పు అందడంతో ఆయన కోర్టు ముందు లొంగిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడానికి ముందు సంజయ్ ఇదే జైలులో 2 రోజుల పాటు ఉన్నాడు. 1996లో బెయిల్ మంజూరు కావడానికి ముందు అతను 16 నెలల పాటు జైలులో ఉన్నాడు.












Click it and Unblock the Notifications
