సెక్సీయెస్ట్ వుమన్ గా బిపాసా బసు
లండన్: బాలీవుడ్ సెక్స్ సింబల్ బిపాసా బసు లండన్ నుంచి వెలువడుతున్న ఆసియా వార్తా పత్రిక ఈస్టర్న్ ఐ నిర్వహించిన సర్వేలో ఆసియా సెక్సియస్ట్ వుమన్ గా ఎంపికైంది. నిరుడు మొదటి స్థానంలో నిలిచిన 25 ఏళ్ల ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిలిచింది. 42 ఏళ్ల బాలీవుడ్ అగ్రతార మాధురీ దీక్షిత్ రెండో స్థానం దక్కించుకుంది. బిపాసా బసు, మాధురీ దీక్షిత్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్, లైలా రాస్, శిల్పా శెట్టి, కత్రినా కైఫ్, కరీనా కపూర్, లారా దత్తా, ఇమాన్ అలీ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచారు. వీరిలో ఎనమండుగురు బాలీవుడ్ తారలే కావడం విశేషం.
యాభై మంది సెక్సియెస్ట్ ఆసియా మహిళ జాబితాను ఈస్టర్న్ ఐ ప్రచురించడం ఇది వరుసగా మూడో ఏడాది. 2005లో కూడా బిపాసా బసు మొదటి స్థానంలో నిలిచింది. సెక్సియెస్ట్ ఆసియా మహిళల కిరీటం తనకు తిరిగి దక్కడం ఆనందంగా ఉందని బిపాసా బసు అన్నది. సెక్సీనెస్ అనేది చూపులకు మాత్రమే పరిమితమైంది కాదని, నిత్య జీవితంలో ఎలా మనల్ని మనం ఎలా క్యారీ చేసుకుంటామనే వ్యక్తిత్వానికి సంబంధించిందని ఆమె అభిప్రాయపడింది. తనకు ఓటు వేసిన వారికి ఆమె కృతజ్ఢతలు తెలియజేసింది. బిపాసా బసు తన బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహం కలిసి నటించిన ధన్ ధనాధన్ గోల్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications
