దేశ రాజకీయాల్లో మలుపు: అద్వానీ
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు దేశ రాజకీయాల్లో ఒక మలుపు అని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం అహ్మదాబాదులో ఒక ప్రకటన విడుదల చేశారు. తన ప్రకటనలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్ విషపూరిత ప్రచారానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా గుజరాత్ ఫలితాలపై ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే విషయాన్ని గుజరాత్ ఫలితాలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.
గుజరాత్ ఎన్నికలను ఆయన 1971 సాధారణ ఎన్నికలతో పోల్చారు. ఆ సమయంలో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదికి వచ్చాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇది చారిత్రకమైన రోజని ఆయన అభివర్ణించారు. ఉత్తమ పాలనకు, అభివృద్ధికి, పని చేసే నాయకత్వానికి ప్రజలు ఓట్లేస్తారని తమ పార్టీ నిరూపించిందని ఆయన అన్నారు. దేశంలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడూ జరుగుతుంటాయని, కానీ ఒక రాష్ట్ర ఫలితాలు జాతీయ రాజకీయాల్లో మలుపు కావడం చాలా తక్కువని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications