చిన్నారి చిరుతల మృత్యుఘోష. విషం పెట్టి, కాళ్లు నరికేసి
అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా విహరించాల్సిన ఆ పసి ప్రాణాలు.. మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల కుట్రకు బలయ్యాయి. అమాయకత్వంతో వేటగాళ్లు వేసిన విషపు ఎరకు చిక్కి విలవిలలాడాయి. అంతటితో ఆగని ఆ కిరాతకులు, ఆ రెండు పులి పిల్లల కాళ్లను అత్యంత క్రూరంగా నరికివేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ శ్యాంపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన వన్యప్రాణి ప్రేమికులను కన్నీరు పెట్టిస్తోంది. దేశవ్యాప్తంగా అటవీ శాఖను తీవ్రంగా కలచివేసిన ఈ దారుణం.. కేవలం ప్రతీకార చర్య కాదు, అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా సిండికేట్ వెనుక ఉన్న ఒక పెద్ద స్కెచ్‌గా అధికారులు భావిస్తున్నారు.
ష్యాంపూర్ కంపార్ట్‌మెంట్ పరిధిలోని సజన్‌పూర్ బీట్‌లో సోమవారం సాయంత్రం అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తుండగా ఊహించని దారుణం వెలుగుచూసింది. సుమారు రెండేళ్ల వయసున్న ఒక మగ పులి కళేబరం వారికి కనిపించింది. దాన్ని చూడగానే అటవీ రేంజర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ పులి నాలుగు కాళ్లు నరికివేశారు దుండగులు. అయితే, విచిత్రంగా దాని చర్మం, కోరలు మాత్రం అలాగే ఉన్నాయి. "బహుశా వేటగాళ్లు చర్మం, కోరలను తర్వాత వచ్చి నిమ్మళంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేసి ఉంటారు" అని హరిద్వార్ డీఎఫ్‌వో స్వప్నిల్ అనిరుధ్ వెల్లడించారు.

ఆ తర్వాత జరిగిన గాలింపులో, ఒక కాలువలో దాచి ఉంచిన ఆ మగ పులి తోబుట్టువు (ఆడ పులి పిల్ల) కళేబరం కూడా లభ్యమైంది. దానికి కూడా అదే ఘోరమైన క్రూరత్వం ఎదురైంది. ఘటనా స్థలంలో సగం తిని ఉన్న ఒక దున్నపోతు కళేబరాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దున్న మాంసంలో ప్రాణాంతకమైన రసాయన విషాన్ని కలిపి ఎరగా వేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ విషపూరిత మాంసాన్ని తిన్న వెంటనే ఆ రెండు పులి పిల్లలు ప్రాణాలు విడిచాయి. చనిపోయిన ఈ రెండు పిల్లలే ఆ తల్లి పులికి ఉన్న ఏకైక సంతానం కావడం, ఆ వంశం అంతమొందడం మరింత విచారకరం.
అడవికి 'స్నేహితులే' ఇప్పుడు శత్రువులయ్యారా?
ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను అటవీ శాఖ గుర్తించింది. నేరస్థలానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న అక్రమ 'వాన్ గుజ్జర్ డేరా'కు చెందినవారిగా వారిని నిర్ధారించారు. ఈ ప్రదేశం రాజాజీ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌కు ఆనుకుని ఉండటం గమనార్హం. దశాబ్దాలుగా వాన్ గుజ్జర్ కమ్యూనిటీని అడవికి సంప్రదాయ సంరక్షకులుగా, జంతువుల స్నేహితులుగా భావించేవారు. కానీ ఈ ఘటన ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది.
ప్రముఖ వన్యప్రాణి ప్రేమికుడు ఎ.జి. అన్సారీ ఈ మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. "గతంలో గుజ్జర్లు అడవికి అండగా ఉండేవారు. కానీ ఈ హేయమైన చర్య వెనుక పెద్ద అంతర్జాతీయ అక్రమ వేట సిండికేట్ల హస్తం ఉందేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. కేవలం పశువులను చంపాయనే ప్రతీకారంతో కాకుండా, అవయవాల స్మగ్లింగ్ కోసమే కాళ్లు నరికినట్లు స్పష్టమవుతోంది" అని వ్యాఖ్యానించారు.
ముమ్మరంగా వేట.. తల్లి పులి కోసం గాలింపు!
నిందితుల్లో 50 ఏళ్ల ఆలం (అలియాస్ అమ్మి) అనే వ్యక్తిని అటవీ శాఖ ఇప్పటికే అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. అయితే ప్రధాన నిందితుడు, పూర్వ నేరచరిత్ర ఉన్న అమీర్ హంజా (అలియాస్ మియాన్)తో పాటు ఆషిక్, జుప్పి అనే ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం అటవీ సిబ్బంది, పోలీసులు, ఎస్‌టిఎఫ్ (STF), వన్యప్రాణుల నేరాల మండలి సంయుక్త బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 2017లో జరిగిన ఒక వేట కేసులో అమీర్ హంజా వద్ద పులి, చిరుత ఎముకలు లభించినట్లు డీఎఫ్‌వో అనిరుధ్ తెలిపారు.
మరోవైపు, ఆ దున్నపోతును వేటాడిన తల్లి పులి జాడ ఇంకా తెలియరాలేదు. తన కళ్ల ముందే పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి పులి ఎక్కడికి వెళ్లిందనేది మిస్టరీగా మారింది. దాన్ని గుర్తించేందుకు అడవిలో భారీగా కెమెరా ట్రాప్‌లను అమర్చారు. ఆ ప్రాంతంలో తాజా పాదముద్రలు లభించడంతో, తల్లి పులి సురక్షితంగానే ఉండి ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 54 పులులకు నిలయమైన రాజాజీ రిజర్వ్ చిల్లా రేంజ్‌కు ఈ ష్యాంపూర్ రేంజ్ అత్యంత కీలకమైన బఫర్ జోన్. అలాంటి సున్నితమైన ప్రాంతంలో జరిగిన ఈ దారుణం భారత వన్యప్రాణుల రక్షణ వ్యవస్థకు పెద్ద సవాలుగా నిలిచింది.














Click it and Unblock the Notifications