చిరంజీవికి వైయస్ పరామర్శ
హైదరాబాద్: పితృ వియోగం సంభవించిన మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫోనులో పరామర్శించారు. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు (76) సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆయన హృద్రోగంతో బాధ పడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఆయనకు విజయదుర్గ, మాధవి అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ఆయన ఆబ్కారీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు.
వెంకట్రావు జగత్ కిలాడీలు, కిలాడీ బుల్లోడు, మంత్రిగారి వియ్యంకుడు సినిమాల్లో చిన్నపాటి పాత్రలు కూడా పోషించారు. వెంకట్రావు భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం హైదరాబాదులో అంత్యక్రియలు జరుగుతాయని చిరంజీవి సోదరుడు నాగబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి చిరంజీవిని పరామర్శించారు. వెంకట్రావు మృతికి సంతాపం ప్రకటించారు. వెంకట్రావును పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. సినీ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి కూడా చిరంజీవిని పరామర్శించారు. ప్రభుత్వ సలహాదారు కె.వి.పి. రామచంద్రారావు చిరంజీవిని పరామర్శించారు.












Click it and Unblock the Notifications