ఆర్టీసి చర్చలు విఫలం: ఎమ్మస్సార్ గుర్రు
హైదరాబాద్: అద్దె బస్సుల విషయంలో ఆర్టీసి యాజమాన్యానికి, గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ ఎంయు) మధ్య చర్చలు విఫలమయ్యాయి. అద్దె బస్సులను తీసుకోవడానికి టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చర్చలు జరపడంలో అర్థం లేదని ఎన్ ఎంయు నాయకులు అంటున్నారు. ఈ విషయంలో ఎన్ ఎంయులో విభేదాలు పొడసూపాయి. ఆర్టీసి హైపవర్ కమిటీతో చర్చలు జరుగుతున్న సమయంలో నాగేశ్వరరావుతో విభేదించి మరో ఎన్ ఎంయు నేత మహమూద్ చర్చలను బహిష్కరించారు.
అద్దె బస్సుల విషయంలో ఎన్ ఎంయు నాటకం ఆడుతోందని మిగతా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ధర్నాకు దిగారు. అద్దె బస్సుల కోసం ఆర్టీసి యాజమాన్యం బుధవారం, గురువారం టెండర్లను స్వీకరిస్తోంది. ఈ వ్యవహారంలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు గుర్రుమంటున్నారు. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని ఆయన మంగళవారం కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించారు. అయితే వారెవరూ చర్చలకు రాలేదు. దీంతో ఆయన గుర్రుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications