రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు.. షాకింగ్ పోస్ట్ !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సాదాసీదా జీవనశైలిని మరోసారి చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనకు వెళ్లిన సీఎం, ఆయన సతీమణి నారా భువనేశ్వరి మార్గమధ్యలో రోడ్డుపక్కన ఆగి తాటి ముంజలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రామీణ ఆహారపు ప్రత్యేకతను గుర్తు చేస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
కాగా కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. జాతర కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు ప్రాంతం వద్ద కల్లు గీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ను ఆపించారు.

"కల్తీ లేదు.. కార్బైడ్ లేదు"..
ఈ మేరకు తాటి ముంజలను రుచి చూస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియా వేదికగా.. "కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగుమందుల గోల లేదు. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డుపక్క ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుంది!" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రసాయనాలతో పండించే పండ్ల మధ్య సహజసిద్ధమైన గ్రామీణ ఆహారాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయ్..
అలానే భువనేశ్వరి కూడా ఈ అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. "తాజా తాటి ముంజలను రుచి చూశాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో వేసవికాలంలో ఇలాంటి సహజమైన ఆహారాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి" అని ఆమె పేర్కొన్నారు. దాంతో వీరిద్దరి పోస్ట్ లకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గ్రామీణ జీవనశైలిపై ప్రేమ, ప్రకృతి పట్ల మమకారం ఈ దంపతుల్లో ఇప్పటికీ అలాగే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కల్తీ లేదు... కార్బైడ్ లేదు....
— N Chandrababu Naidu (@ncbn) May 20, 2026
పురుగు మందుల గోల లేదు...
మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్చమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది! pic.twitter.com/2Fy4VSDa3E
కల్లు గీత కార్మికులతో ముచ్చట..
అంతే కాకుండా తాటి ముంజలు తిన్న తర్వాత చంద్రబాబు అక్కడే పనిచేస్తున్న కల్లు గీత కార్మికులతో కాసేపు మాట్లాడారు. వారి వృత్తి పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సహజమైన, సంప్రదాయ గ్రామీణ ఆహార పదార్థాలను ప్రోత్సహించాలనే సందేశాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ఇచ్చారు. తాటి ముంజలు వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు












Click it and Unblock the Notifications