పిజెఆర్ కు అసెంబ్లీ నివాళి
హైదరాబాద్: ఇటీవల పరమపదించిన శాసనసభ్యులు పి. జనార్దన్ రెడ్డి, జయప్రకాశ్ లకు రాష్ట్ర శాసనసభ మంగళవారం నివాళులు అర్పించింది. సంతాప తీర్మానాలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించారు. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. హైదరాబాదులో పి. జనార్దన్ రెడ్డి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పిజెఆర్ మృతి కాంగ్రెస్ కు, కార్మిక లోకానికి తీరని లోటు అని ఆయన అన్నారు. స్వర్గీయ అంజయ్య ఆడుగుజాడల్లో నడిచిన నాయకుడు పిజెఆర్ అని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా పిజెఆర్ సమర్థంగా పనిచేశారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. 26 మంది శాసనసభ్యులే ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా పిజెఆర్ కు తాము తగిన గౌరవం ఇచ్చామని ఆయన చెప్పారు. ఈ మాటలకు అధికార కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. సంతాప తీర్మానంపై మాట్లాడుతుంటే ఇదేమిటని చంద్రబాబు అన్నారు. కృష్ణా జలాలను హైదరాబాదుకు తరలించే పథకానికి పిజెఆర్ పేరు పెట్టాలని బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి సూచించారు. పిజెఆర్ అంత్యక్రియల సందర్భంగా వాడిన వాహనం సరిగా లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు నాయని నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications
