నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర మంత్రివర్గం గురువారం లాంఛనప్రాయంగా ప్రకటించింది. ఐదు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనకు ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉంది. దేశంలోని జార్ఖంఢ్, అసోం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలను మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కమిషన్ ఇప్పటికే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం ఈ కమిషన్ 2002లో ఏర్పాటయింది. గత ఏడాది శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ విభజన కారణంగా అనేక మంది నాయకులు వారికి పెట్టనికోటలుగా ఉన్న నియోజకవర్గాలు పూర్తిగా కోల్పోనున్నారు. ఈ విభజనపై పలు రాజకీయ పార్టీల నాయకుల్లో భయాందోళనలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దీనిపై జాప్యం చేస్తూ వచ్చింది.
నియోజకవర్గాల పునర్విభజనపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 4వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన అనంతరం జరగాలని యూపీఏ కోరుకుంటుంది. ఇదిలా ఉంటే బీజేపీ ఈ నియోజకవర్గాల పునర్విభజనను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శిస్తోంది. దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్, బీజేపీ పార్టీల మధ్య ఇటీవల జరిగిన రాజకీయ డ్రామా కారణంగా తాము లాభపడతామని కాంగ్రెస్ భావిస్తోందని బీజేపీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంతంలో నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. ఇది తమకెంతో ఉపయోగపడుతుందన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అంటోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పునర్విభజన ప్రక్రియను ప్రకటించడంతో కర్ణాటకలో సెప్టెంబర్/అక్టోబర్‌కు ముందుగా ఎన్నికలు జరగవని స్పష్టం అవుతోంది. మేఘాలయా, త్రిపుర, మిజోరాం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా నవంబర్ 2008లో ఎన్నికలు జరగాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
