వైయస్ ది ఇదేం తీరు?: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ అంశం విషయంలో ఏదో పొగొట్టుకుంటున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి కొత్త వాదనలను ముందుకు తెస్తున్నారని ఆయన విమర్శించారు. తమకేదో తెలివితేటలున్నాయి, తెలంగాణవారికి లేవు తాము సక్రమంగా పాలిస్తామనే మాటలు తప్పు అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో కాలం పట్టదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన డబ్బు అందరికీ చెందాలనే వాదనను ఆయన వ్యతిరేకించారు. తమ మానాన తమను వదలేయాలని, రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రం మూడు ముక్కలు కాదు, 12 ముక్కలు కానీయండి కానీ తమకు తెలంగాణ కావాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించి ముఖ్యమంత్రి తన గౌరవం నిలుపుకోవాలని ఆయన సూచించారు. రాయలసీమ రాష్ట్రం అడిగితే అడగనీయండని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రత్యేక రాయలసీమను అడిగినవారేనని, రాయలసీమకు అన్యాయం జరిగిందని బ్లాక్ డేలు నిర్వహించినవారేనని ఆయన అన్నారు. తను రెచ్చగొట్టడానికి, తప్పు దోవ పట్టించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతూ 41 మంది తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు సోనియాకు రాజశేఖర రెడ్డి కోరికతోనే వినతిపత్రం సమర్పించారని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి చెప్తేనే సోనియాకు ఆ వినతిపత్రం సమర్పించారని ఆయన అన్నారు. వినతిపత్రం చివరలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే వాక్యం ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని ముఖ్యమంత్రే శాసనసభలో ప్రతిపాదించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తగాదాలు పెట్టడం, పరస్పరం రెచ్చగొట్టడం ముఖ్యమంత్రికి తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
