ఉభయ సభల నుంచి తెరాస సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు గురువారం ఉభయ సభల నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నెల 18వ తేదీ వరకు వారు సభల నుంచి వారు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయమై స్పీకర్ వివిధ పక్షాల అభిప్రాయాలను కనుక్కున్నారు. ఆ సమయంలో కూడా తెరాస సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా తెరాస సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చునని స్పీకర్ చేసిన సూచనను తెరాస సభ్యులు పట్టించుకోలేదు. దీంతో తెరాస సభ్యుల సస్పెన్షన్ కు శాసనసభా వ్యవహారాల మంత్రి తీర్మానం ప్రతిపాదించారు.
స్పీకర్ తెరాస సభ్యులను ఈ నెల 18వ తేదీ వరకు సస్పెండు చేశారు. శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై తెరాస సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో తెరాస సభ్యులను చైర్మన్ చక్రపాణి ఈ నెల 18వ తేదీ వరకు సస్పెండు చేశారు.












Click it and Unblock the Notifications
