బాక్సైట్ తవ్వకాలపై అసెంబ్లీలో రగడ
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గురువారం శాసనసభ దద్ధరిల్లింది. బాక్సైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం సభ్యులు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి పొందిన కంపెనీలో వాటాదారులు ఎవరో వెల్లడించాలని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. దుబాయ్ కంపెనీ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఇందులో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థను పావుగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి బంధువులకు ఇందులో ప్రమేయం ఉందని ఆయన అన్నారు.
గిరిజనులు వద్దంటున్నా తవ్వకాలు జరుపుతున్నారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి తవ్వకాలు వద్దంటుంటే రాష్ట్ర ప్రభుత్వమేమో తవ్వకాలకు అనుమతిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. దీంతో తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మైక్ ఎందుకు కట్ చేశారో తెలియజేయాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం చెబుతానని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని సిపియం విమర్శించింది.












Click it and Unblock the Notifications