రాహుల్ మంచి ప్రధాని కాగలరు: బ్లెయిర్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మంచి ప్రధాని కాగలరని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్ ను, రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ప్రపంచంలోని ప్రతిభావంతులైన యువనేతల్లో రాహుల్ గాంధీ ఒక్కరని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో రాహుల్ మంచి సంస్కరణలు తెస్తున్నారని ఆయన ప్రశంసించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు వాతావరణ మార్పులపై తమ చర్చల్లో బ్లెయిర్, మన్మోహన్ దృష్టి సారించారు. వాతావరణ మార్పులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడంపై ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
అభివృద్ధి చెందిన దేశాల వల్లనే ప్రపంచం వాతారవరణ సమస్యను ఎదుర్కొంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయం తనకు కూడా తెలుసని, పశ్చిమదేశాలు, అభివృద్ధి చెందిన దేశాల వలనే ఈ సమస్య ఉత్పన్నమైందన్న వాదన నిజమని బ్లెయిర్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు.అయితే భారత్, చైనా వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సమాన బాధ్యత ఉందని తాను భావిస్తున్నట్లు బ్లెయిర్ చెప్పారు. వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడంలో అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ భారం మోయాలని, అదే సమయంలో సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందజేయాలని మన్మోహన్ సింగ్ కోరారు.












Click it and Unblock the Notifications