ఏడాదిలో పులిచింతల పూర్తి: వైయస్
గుంటూరు: కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టును మరో ఏడాదిలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు పనులు శరవేగంతో సాగుతున్నాయని ఆయన చెప్పారు. బాపట్ల సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టును గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కృష్ణా డెల్టాకు జూన్ మొదటివారంలోనే నీరందించడానికి పులిచింతల ప్రాజెక్టుపై తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన చెప్పారు.
కృష్ణా, నాగార్జునసాగర్ ల ఆయకట్టులను ఆధునీకరిస్తామని ఆయన చెప్పారు. అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. రైతుల రుణమాఫీని, పావలా వడ్డీకి రుణాల ప్రదానం, బడుగు వర్గాల రుణాల మాఫీ అంశాలను ఆయన ప్రస్తావించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ధిలో మనల్ని మించినవారు ఉండరని ఆయన అన్నారు. బాపట్ల బహిరంగ సభలో కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి తదితరులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications