పేలిన రిటైర్డ్ ఐపియస్ రివాల్వర్
హైదరాబాద్: హైదరాబాదులోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో గల మధురానగరులో రిటైర్డు ఐపియస్ అధికారి బాబ్జీ కుమారుడు రమేష్ చేతిలోని రివాల్వర్ పేలింది. ఈ పేలుడులో రమేష్ గాయపడ్డాడు. అతన్ని వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. అతని ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారు. బుధవారం మధ్యాహ్నం అధికారులు బాబ్జీ లైసెన్స్ తుపాకిని తనిఖీ చేయడానికి ఇంటికి వచ్చారు. వారు తనిఖీ చేసి వెళ్లిపోయిన తర్వాత రమేష్ దాన్ని శుభ్రం చేయడం మొదలు పెట్టాడు. ఈ సమయంలో రివాల్వర్ పేలింది.
రివాల్వరులోని ఒక బుల్లెట్ రమేష్ ఎడమ కాలి తొడ భాగంలోకి దూసుకుపోయింది. దీంతో రక్తస్రావం జరిగింది. ఇరుగుపొరుగువారు అతన్ని ఆస్పత్రికి తరలించారు. రివాల్వర్ ప్రమాదవశాత్తు మాత్రమే పేలిందని పోలీసులు అంటున్నారు. బాబ్జీ ఏడేళ్ల క్రితం పదవీ విరమణ చేసి మధురానగర్ లోని శిల్పా అపార్టుమెంటులో ఉంటున్నారు. కుమారుడు రమేష్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications