ఖైరతాబాదులో పోటీకి తెరాస యోచన
హైరాబాద్: ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణుల నుంచి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ తెర్లాంలో తన అభ్యర్థిని దించదు. కాంగ్రెస్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి మృతి వల్ల ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం ఖాళీ అయింది. ఈ నియోజకవర్గం నుంచి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని కాంగ్రెస్ తన అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెసుకు వదిలివేయాలని తెరాస గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తెరాస శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఓడించడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి తెలుగుదశం మద్దతు తెలిపేలా లోపాయికారి ఒప్పందం కుదిరిందని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, అందువల్ల ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తమపై శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగిందని ఆయన చెప్పారు. ఖైరతాబాద్ నుంచి ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించాలని తెరాస యోచిస్తోంది. అయితే ఈ విషయంపై తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు, కార్యవర్గం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు హరీష్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications